ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీచాయి. శ్రీకాకుళం, వీరఘట్టం, ఆమదాలవలసలో ఈదురుగాలులు వీచాయి. సీతంపేట, కొత్తూరు, భామిని, పాలకొండ, జలుమూరు, సారవకోటలో తేలికపాటి వర్షంతోపాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరుబుజ్జిలి మండలం పాలవలసలో పిడుగుపడి ఒకరు మృతి చెందారు.
విశాఖ నగరంలో భారీగా ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ గాలుల వల్ల విశాఖలో విద్యుత్ సరఫరా నిలిచింది. నర్సీపట్నం, గొలుగొండ, అనకాపల్లి, చీడికాడ, కె.కోటపాడు, పాడేరులో వర్షం కురుస్తోంది. మన్యంలో వర్షం, గాలులు కారణంగా.. విద్యుత్ సరఫరా నిలిచింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాన్వెంట్ కూడలి, అల్లిపురం, అక్కయ్యపాలెం, రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి.
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షం, వీచిన గాలులతో పంట, నష్టం వాటిల్లింది. బలమైన గాలుల ధాటికి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కోమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి, చెట్లు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో అరటి,జీడీ, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కొమరాడ మండలం శనివారం సాయంత్రం వీచిన బలమైన గాలులకు అంతరాష్ట్ర రహదారిపై, కొమరాడ జూనియర్ కాలేజీ వద్ద పడిన చెట్లు వల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో కొమరాడ ఎస్సై జ్ఞాన్ ప్రసాద్ సిబ్బందితో కలిసి అంతర్రాష్ట్ర రహదారిపై పడి ఉన్న చెట్లను తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చెట్లు అంతర్రాష్ట్ర రహదారిపై పడిన వెంటనే స్పందించిన ఎస్సై జ్ఞాన్ ప్రసాద్, సిబ్బందికి గ్రామ ప్రజలు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు