Doctor kidnap case శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు గూడేన సోమేశ్వరరావు స్థానిక కిమ్స్ ఆసుపత్రి ఎండీగా పని చేస్తున్నారు. ఆసుపత్రి ఎదురుగా ఉన్న సొంతింట్లోనే నివాసముంటున్నారు. అదే భవనంలో ఒక అంతస్థు ఖాళీగా ఉండటంతో జిమ్ నిర్వహించుకునేందుకు శ్రీకాకుళానికే చెందిన ఉర్జన చంద్రరావు(చందు)కు అవకాశమిచ్చారు. చందుతో సన్నిహితంగా ఉండే సోమేశ్వరరావు వ్యక్తిగత విషయాలను పంచుకునేవారు. ఈ క్రమంలో నిత్యం జిమ్‌కు వచ్చే నగరంలోని విశాఖ-బీ కాలనీకి చెందిన గోలి రవితేజకు చందుతో స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి వివిధ వ్యాపారాలు చేసి, నష్టపోయారు. అప్పులను తీర్చుకునేందుకు డాక్టర్‌ను కిడ్నాప్ చేసి, రూ.50 లక్షలు డిమాండ్ చేయాలని, ఒకవేళ ఇవ్వకుంటే చంపేయాలని అనుకున్నారు.
ప్రణాళికను అమలు చేసేందుకు రవితేజ రూ.5 లక్షలు ఇస్తామని విశాఖపట్నం వాసి రాజాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కడితో పనికాదని భావించి విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన పరమేశ్‌తోనూ బేరం మాట్లాడారు. నంబరు ప్లేట్ మార్చి ఒక కారును సిద్ధం చేసుకున్నారు. ఈనెల 7, 8, 9వ తేదీల్లో రవితేజ, రాజా, పరమేశ్‌లు రెక్కీ నిర్వహించారు. వైద్యుడు రోజూ ఉదయం 6 గంటలకు ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో షటిల్ ఆడేందుకు వస్తారని గుర్తించారు. పథకం ప్రకారం 10వ తేదీ ఉదయం ముగ్గురు ఫంక్షన్‌హాల్ లోనికి వెళ్లారు. రవితేజ సూచనతో రాజా, పరమేశ్‌లు మెట్లు దిగుతున్న వైద్యుడు సోమేశ్వరరావు ముఖంపై గుడ్డ కప్పి, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన కేకలు వేయడంతో రవితేజ కారుతోపాటు పారిపోయాడు. రాజా తప్పించుకోగా పరమేశ్‌ను స్థానికులు పట్టుకుని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారణ ప్రారంభించిన పోలీసులు బుధవారం రవితేజ, చందు, పరమేశ్‌లను అరెస్టు చేశారు. రాజా ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి ఒక కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో శ్రీకాకుళంలో డీఎస్పీ ఎం.మహేంద్ర వివరాలు వెల్లడించారు.
ఇవీ చదవండి: