శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను ప్రజలు సమస్యలపై నిలదీశారు. మంగళవారం జి.సిగడాం మండలం నడిమివలస సచివాలయ పరిధి గదబపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఆయనకు నిరసన సెగ తప్పలేదు. ఏ వీధికి వెళ్లినా.. ఏ గడప తట్టినా ప్రశ్నల వర్షం కురిసింది. అన్నింటికీ సమాధానం చెప్పలేక ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓ దశలో తీవ్ర అసహనానికి లోనయ్యారు. ‘‘ఈ రోడ్డు చూశారా.. ఎలా ఉందో.. రెండు కిలోమీటర్ల మేర ప్రయాణానికి నిత్యం అవస్థలు పడుతున్నాం. ఎప్పుడు వేస్తారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ వేయలేదు. అసలు వేస్తారా లేదా. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సు రాదు, గ్యాస్ బండివాడు రాడు. పాల ప్యాకెట్లు రావు.. ఎలా బతకాలో మీరే చెప్పండి? అంటూ మహిళలు ప్రశ్నించారు.
మరో వీధిలో మహిళలు, యువత మాట్లాడుతూ.. ‘‘రోడ్లు, కాలువలు లేవు. మురుగంతా ఇళ్ల ముందే నిల్వ ఉంటోంది. మీరు వచ్చారని మూడేళ్ల తర్వాత బ్లీచింగ్ చల్లారు. ప్రతి ఇంటిలోనూ విష జ్వరాలతో బాధపడుతున్నాం’’ అని వాపోయారు. మరో ఇంటివద్ద ఎమ్మెల్యే ఆగి ఇప్పటివరకు ప్రభుత్వం అందజేసిన పథకాలను వివరిస్తుండగా.. ‘‘డబ్బులు మాకెందుకు.. రెక్కల కష్టంతో కష్టపడి సంపాదించుకోగలం. రోడ్లు, కాలువలు, కుళాయిలు వేయండి చాలు’’ అని మహిళ బదులిచ్చింది. గ్రామంలో పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, పిల్లలను బడికి పంపాలన్నా భయంగా ఉందని అక్కడకు తీసుకెళ్లి యువకులు చూపించారు. నూతన భవనం మంజూరు చేయాలని విద్యార్థులు ప్రాధేయపడ్డారు.
ఇవీ చూడండి
ఘోర రైలు ప్రమాదం, 53 మందికి గాయాలు
కొత్త మూవీ కోసం మహేశ్ మేకోవర్, ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్‌తో
మహిళలపై ద్వేషంతోనే వరుస హత్యలు, విశాఖలో మిస్టరీని ఛేదించిన పోలీసులు