తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కొంతమేర తగ్గినా.. వరదలు మాత్రం వీడటం లేదు. ఏలేరు, శుద్ధగడ్డ కాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో మెట్ట ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, పత్తి, ఉద్యానవన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు, మన్యం ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కాల్వలు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి.
ఎగువ నుంచి భారీగా వచ్చి చేరిన వరదనీటితో ఏలేరు జలాశయం పూర్తిగా నిండింది. సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయడంతో కిర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద వెల్దుర్తి రహదారిలో వరద నీటి తాకిడికి వంతెన కూలి... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాల్వలకు గండ్లు పడటం, ఏలేరు ఉద్ధృతికి గొల్లప్రోలు మండలంలో పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయి. 3వేలకు పైగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కోనసీమలో పంటలు నీటిలోనే మగ్గిపోతున్నాయి. అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుని, తొండంగి, ప్రత్తిపాడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరపలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పర్యటించి... బాధిత రైతులను పరామర్శించారు. ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో 50 వేల ఎకారాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. పరిహారమిచ్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వంశధార నదిలో రెండు రోజులుగా వరద పోటెత్తుతుండటంతో ఎప్పటికప్పుడు నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. మడ్డువలస ప్రాజెక్టు నుంచి ఏడు గేట్ల ద్వారా దిగువకు వరద నీరు వదులుతుండటంతో.. నాగావళి ఉగ్రరూపం దాల్చింది. బూర్జ మండలం బొమ్మిక గజ్జిలిగెడ్డ జలాశయానికి గండ్లు పడటంతో ఆ ప్రవాహానికి సమీప పొలాల్లోకి కొట్టుకొచ్చిన మట్టి, రాళ్లు మేటలుగా ఏర్పడ్డాయి
వరద నీరు కొన్ని ప్రాంతాల్లో పొలాల పైనుంచి ప్రవహిస్తుండటం, రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో... రైతులు పంటలపై ఆశలు వదులుకున్నారు. ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీచదవండి