MLA Gorle Kiran Kumar Gadapa Gadapa Programme: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికి వెళ్లిన ప్రజాప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. ఎమ్మెల్యే, మంత్రులు, నాయకులు ఇలా ఎవరైనా గానీ.. ప్రజలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తమ సమస్యలను ఎందుకు పరిష్కరించటం లేదు?అని అంటూ.. తమ దగ్గరకు వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి తిరగకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి వార్నింగ్లు.. ప్రజల దగ్గరకు వెళ్తే ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి. ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఇది. సీఎంకు భయపడి ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తే.. ప్రజలు అడిగే ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితే.. ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్కు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మధుపాం పంచాయితీ నల్లిపేట గ్రామంలో గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్కు నిరసన సెగ తగిలింది. ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందలేదని, గ్రామం అధ్వానంగా ఉందంటూ.. మాటల వర్షంతో ఉక్కురిబిక్కిరి చేశారు. గ్రామంలో సాంకేతిక లోపాలు చూపించి అర్హులైన వారికి సంక్షేమ పథకాల అందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
17 ఏళ్లుగా గ్రామంలోని టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఇప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒకటి కూడా రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో గ్రామస్థులు అందరం కలిసికట్టుగా ఓటేసినందుకు తమకు ఈ నాలుగేళ్లలో తగిన బుద్ధి చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో తాగునీరు లేదంటూ.. ఇంత వరకు రోడ్లు కూడా వేయలేదంటూ గ్రామస్థులు.. ఎమ్మెల్యేను నిలదీశారు. మీ పార్టీని, మిమ్మల్ని నమ్ముకున్నందుకు మాకు బాగానే న్యాయం చేశారంటూ ఎద్దేవా చేశారు. దీంతోపాటు ఇక మీ వైసీపీ పార్టీలో ఉండము అని గ్రామస్థులంతా ముక్తకంఠంతో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే వారిని వారించి.. తక్షణమే గ్రామంలో చేతిపంపు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: