ఆంగ్లమాధ్యమంపై తెదేపా, జనసేన నేతలు చేసిన వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ఖండించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... నాడు-నేడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు అన్ని మౌలిక వసతుల కల్పన కోసం తొలివిడతగా 16 వేల పాఠశాల అభివృద్ధి కోసం రూ.33 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు సరికాదని కొడాలి నాని హితవు పలికారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు మట్టికొట్టుకు పోతారని శాపనార్థాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నడుపుతున్న స్కూలులో ఇంగ్లీష్ మీడియం లేదా అని ప్రశ్నించారు..?
ఆంగ్ల మాధ్యమంలో చదివిన ఎంపీ రామ్మోహన్నాయుడు... పార్లమెంటులో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని... తెలుగు మాధ్యమంలో చదివిన అచ్చెన్నాయుడు విజయవాడ చుట్టుపక్కల తిరుగుతూ... భయపెడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు... తెదేపా నేతలు ఇసుకను ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు.