దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయ ఉపకులపతి(వీసీ)గా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు దిల్లీ ఉన్నత విద్యాశాఖ సంచాలకులు అజ్మిల్ హఖ్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పడిన తరువాత తొలి వైస్ ఛాన్సలర్‌గా కరణం మల్లీశ్వరీకే అవకాశం దక్కింది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన కరణం మల్లీశ్వరి ఓ చిన్న గ్రామం నుంచి.. ఒలింపిక్స్‌లో పతకం వరకూ చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్లిప్టింగ్లో భారత్‌కు కాంస్య పతకం సాధించారు. 1999 కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో మల్లీశ్వరిని సత్కరించింది.
- సిక్కోలు బిడ్డ మల్లీశ్వరికి అరుదైన అవకాశం
ఒలింపిక్ పతక విజేతగా, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు బిడ్డ కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఈమె దిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులయ్యారు. వెయిట్ లిఫ్టింగ్‌లో జిల్లా ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింపజేసిన ఈమెకు ఈ అవకాశం రావడం పట్ల జిల్లాలోని క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస పట్టణ పరిధిలోని ఊసవానిపేట ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి ఇక్కడే వెయిట్ లిఫ్టింగ్‌లో తర్ఫీదు పొందారు.
క్రీడాకారిణిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో పతకాలను సాధించారు. పురస్కారాలు అందుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన మల్లీశ్వరి ఉన్నత స్థానాన్ని పొందడంపై ఊసవానిపేట గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలో వెయిట్ లిప్టింగ్ అకాడమీ నెలకొల్పేందుకు సన్నాహాలు జరిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా ఒలింపిక్ వెయిట్ లిప్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పిలి అప్పన్న, తదితరులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండీ... YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్