'5 నెలల వైకాపా పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది' ప్రజా పరిపాలన వ్యవస్థలో అక్రమ కేసులు, దాడులు, రివర్స్ టెండర్లు తప్ప ప్రజాసంక్షేమం అనేది పూర్తిగా కుంటుపడిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 నెలల వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి రాజధాని లేకుండా చేయడం బాధాకరమన్న కళా... 24 గంటలూ మద్యం అమ్మకాలు చేస్తూ వాటిని ఓ కుటీర పరిశ్రమలా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదన్న ఆయన.. ప్రపంచ బ్యాంకు సైతం అప్పు ఇచ్చేందుకు నిరాకరించడం జగన్‌మోహన్ రెడ్డి పరిపాలనపై ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుందన్నారు. పంచాయతీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. సొంత వారికే పనులు కల్పించేందుకు వైకాపా ఉందని ఆరోపించారు. ప్రశ్నించే పత్రికలు, టీవీ ఛానళ్ల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇదీ చదవండి :
'రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి'