శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతీయాసుపత్రిలో ఏం జరుగుతోందంటూ ఐటీడీఏ పీవో సీహెచ్ శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం మధ్యాహ్నం 3.05 గంటలకు ప్రాంతీయాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో వైద్యుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో పది మంది వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉండగా, ఒక్కరు మాత్రమే ఉన్నారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో, మరో ఇద్దరు వైద్య నిపుణులు సెలవులో ఉన్నట్లు ఆసుపత్రి హాజరుపట్టికలో పీవో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా సెలవులు ఎలా తీసుకుంటున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. 3.20 గంటల సమయంలో ప్రసూతి వైద్యనిపుణురాలు ఆసుపత్రికి రావడాన్ని గుర్తించి ప్రశ్నించారు. రాత్రి విధులు కారణంగా ఆలస్యమైందని ఆమె పీవోకు వివరణ ఇచ్చారు. ఆలస్యం తగదంటూ మందలించారు. మరో నలుగురు వైద్యులు హాజరైనట్లు రిజిస్టరులో సంతకాలు చేసినప్పటికీ ఆ సమయంలో లేరు. ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం
విధి నిర్వహణలో అలసత్వం వహించిన తొమ్మిది మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతోపాటు, కలెక్టర్‌కు, ప్రభుత్వానికి సైతం చర్యల నిమిత్తం పీవో నివేదిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ..
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పీవో శ్రీధర్ ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిని సందర్శించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యనిపుణులు బి.శ్రీనివాస్ రోగులకు సేవలందిస్తూ కనిపించారు. పీవో వైద్యుడిని ప్రశ్నించగా భోజన విరామ సమయానికి వచ్చానని బదులిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండాల్సిన సమయంలో ప్రైవేటుగా సేవలందిస్తుండడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: