కరోనా వేళలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం కొరత రాకుండా చూడాలని సర్కారు ఆశించింది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిర్ణయం జిల్లాలో నీరుగారిపోయింది. పాఠశాలలు తెరవని రోజులను లెక్కల్లోకి తీసుకుని 'గోరుముద్ద' పథకం కింద ముడిసరకులను పంపిణీ చేయడానికి విద్యాశాఖ నిర్ణయించింది. 62 పనిదినాలకు ఒక్కో విద్యార్థికి 56 కోడిగుడ్లు, 34 చిక్కీలు అందించాలని అధికారులు ఆదేశించారు. వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. తగినంత సామాగ్రి ఇవ్వలేదు.
పలు మండలాల్లో పరిస్థితి:
జిల్లా వ్యాప్తంగా 3,880 పాఠశాలలకుగాను 70శాతం బడుల్లో 56కు బదులు 34 కోడిగుడ్లు మాత్రమే విద్యార్థులకు అందించారు. మెళియాపుట్టి మండలంలో 105 పాఠశాలల్లోని 7,714 మంది విద్యార్థులకు ఇప్పటికీ గుడ్లు, చెక్కీలే ఇస్తున్నారు. భామిని మండలంలోని 75 బడుల్లో విడతలవారీగా అరకొర సరకులు పంపిణీ చేశారు. అన్నీ ఇచ్చినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హిర మండలంలోని సుమారు 80 పాఠశాల్లో 4,743 మంది పిల్లలకు డ్రైరేషన్ సరకులు, గుడ్లు, చెక్కీలు మాత్రమే పంపిణీ చేశారు. కొత్తూరు మండలంలో 101 పాఠశాల విద్యార్థులకు పలు దఫాలుగా డ్రై రేషన్‌ను అందించారు. సీతంపేట మండలంలో 170 పాఠశాలల్లోని 10,495 మంది విద్యార్థులు ఉండగా.. గిరిజనులే ఎక్కువగా విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరందరికీ అంగన్‌వాడీలో 'సంపూర్ణప్లస్' అమలవుతున్నందున 'గోరుముద్ద' పథాకాన్ని గిరిజనులు మరిచారు. ఇక్కడా డ్రైరేషన్ సరకులు కొన్నే అందిస్తున్నారు.
పంపిణీకి చర్యలు:
జిల్లాలోని అన్ని బడులకు కోడిగుడ్లు, చిక్కీలు పూర్తిస్థాయిలో పంపిణీ చేశాం. కొన్ని పాఠశాలలకు బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోంది. చౌక దుకాణాల నుంచి ఇవ్వడంలో.. సర్వర్ సమస్యత కారణంగా ఆలస్యం అవుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపడతాం. - చంద్రకళ, డీఈవో, శ్రీకాకుళం
ఇదీ చదవండి: లెక్క పాతది..చిక్కు కొత్తది..!