ఆదివాసీ యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటూ... జీవనోపాధి కోసం నానాపాట్లు పడుతున్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ యువతీ, యువకులు ఈ కోర్సును నేర్చుకొనేందుకు ముందుకొచ్చారు. వీరికి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఐఐహెచ్‌ఎంఆర్ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది.
హైదరాబాద్‌కు చెందిన వాసన్ ఆర్గనైజేషన్ ఏపీలో శిక్షణ ఇచ్చేందుకు బాధ్యతను తీసుకుంది. శిక్షణకు అనువుగా ఉండే శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. బూర్జ మండలం పెద్దపేటలోని ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ వేదికగా 12 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. విద్యార్ధులకు క్షేత్రస్థాయిలో అనుభవాలు తెలిసేలా గ్రామాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జిల్లాలోని బూర్జ, వీరఘట్టం, సీతంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో యువత పర్యటించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం, పాడిని నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలను కలిశారు. క్షేత్రస్థాయి పర్యటనలో పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పశువులు, కోళ్ల మేత, పెంపకం, కోళ్ల సంతతి అభివృద్ధి, చేపల పెంపకం, పోడు వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతులు, సేంద్రియ సాగులో వల్ల ప్రయోజనాలు వంటి అంశాలు పరిశీలించామని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు చెబుతున్నారు.
శిక్షణ పూర్తయిన వెంటనే ఉపాధి పొందేలా కార్యక్రమం రూపకల్పన చేశారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న 3బ్యాచ్‌ల యువత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్న అధికారులు... తెలుగు రాష్ట్రాల నుంచి ఆదివాసీ యువత ముందుకు రావాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి...