శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి రేవులో అర్ధరాత్రి ఇసుక దందా సాగుతోంది. దాదాపు 25 నుంచి 30 లారీలతో ఇసుకను విశాఖకు అక్రమంగా తరలిస్తున్నారు. వాస్తవానికి నాగావళి నదికి అవతలి వైపు ఉన్న సింగూరు వద్ద ప్రభుత్వం అధికారికంగా రేవు కేటాయించింది. అక్కడ ఇసుక నిండుకోవడంతో...అక్రమార్కులు ఇవతలి ఒడ్డున ఉన్న దూసిరేవులోకి చొరబడ్డారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఇసుక తరలించకూడదని నిబంధనలు ఉన్నా....ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు ఇసుక తరలిస్తున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయం తెలుసుకున్న మాజీ విప్, తెలుగుదేశం నేత కూన రవికుమార్ అక్కడికి చేరుకుని లారీలను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని అక్కడి నుంచే జిల్లా ఎస్పీతోపాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్ 22 నుంచి ఏయే తేదీల్లో, ఏయే నంబర్లతో ఎంతేసి ఇసుక విక్రయించింది... ఎంత సొమ్ము వసూలు చేసిందనే లెక్కలతో కూడిన పుస్తకాన్ని సైతం అక్కడి నిర్వాహకుల నుంచి కూన రవికుమార్ స్వాధీనం చేసుకుని అధికారులకు అందజేశారు. రేవులో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు ఉన్నాయి. నదీ గర్భంలో ఆరు నుంచి ఏడు జేసీబీలతో ఇసుకను లారీల్లోకి ఎక్కిస్తున్నట్లు అక్కడికి చేరుకున్న ఆమదాలవలస ఎస్‌ఐ, ఏపీఎంఐడీసీకి చెందిన జియాలిస్టులు గుర్తించారు. అక్కడి నిర్వాహకులు ఒక్కో లారీ నుంచి 10 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు కూన రవికూమార్ తెలిపారు. లారీల వద్ద ఉన్న వే బిల్లులు సైతం తప్పుడువని ఆరోపించారు. సాయంత్రం ఆరున్నరకే రేవు మూసివేసి వెళ్లిపోతే....వే బిల్లులపై సమయం మాత్రం రాత్రి 7 గంటల 40 నిమిషాలని ఉండటంపై ఆయన మండిపడ్డారు. నిర్వాహకులు వెళ్లిపోయినా...వే బిల్లులు ఎలా వచ్చాయని అధికారులను నిలదీశారు.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుకదందా సాగుతోందని కూనరవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రేవుల్లో సీసీకెమెరాలు, లైట్లు, వేయింగ్ మెషిన్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా....ఇక్కడ అలాంటివేమీ లేవని ఆయన నిలదీశారు. ఇక్కడే కాకుండా పెద్దసవలాపురం, యరగాం, పురుషోత్తపురం రేవుల్లోనూ గత 6 నెలలుగా ఇదే దందా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.