Missing Girl Identified : తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఆ పసి హృదయాన్నిగాయపర్చాయి. తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిన ఆ లేతమనసు ఆమెను చేరుకునేందుకు చేసిన ప్రయత్నం అందరినీ కలవరానికి గురి చేసింది. తండ్రి బాధ్యతారాహిత్యం బాలిక అదృశ్యం కావడానికి దారితీసింది. శ్రీకాకుళం జిల్లా..టెక్కలిలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం అదృశ్యమైన పదో తరగతి విద్యార్థినిని టెక్కలి పోలీసులు సురక్షితంగా ఆమె కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. మంగళ వారం రాత్రి పోలీసు స్టేషన్లో దళిత సంఘాల ప్రతినిధులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సమక్షంలో ఎస్సై కామేశ్వరరావు బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు.
జరిగింది ఇదీ...
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. టెక్కలి బీసీ బాలికల గురుకులానికి చెందిన బాలిక.... నేను శానిటైజర్ త్రాగాను అందరికీ బై.. అంటూ తరగతి గది బోర్డుపై రాసి కనిపించకుండా పోయింది. విద్యార్థిని అదృశ్యంపై అటు పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థిని బంధువులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బంధువులకు ఫోన్ చేసిన విద్యార్థిని... ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు...విచారణ జరపగా చివరికి బాలిక ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమైంది.
కోటబొమ్మాళి మండలంలోని కురుడుకు చెందిన బాలిక తల్లిదండ్రులు భారతి, సింహాచలం మనస్పర్ధలతో 14 ఏళ్ల కిందట విడిపోయారు. తండ్రి మద్యం తాగడం, తల్లి అందుబాటులో లేకపోవడంతో బాలిక మనస్తాపానికి గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈమె తల్లి గతంలో ఆమదాలవలసలో ఉండేదని, ఆమెను వెతుక్కుంటూ బాలిక వెళ్లడంతో అదే ఇంట్లో ఉన్న మహిళ బాలికను చేరదీసినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను టెక్కలికి తీసుకువచ్చి తండ్రి, బంధువులకు అప్పగించారు.
ఇదీ చదవండి : Kadapa Suicide's Mystery: ఇద్దరు విద్యార్థినుల బలవన్మరణం..కారణమేంటి..?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!