Fight between YCP and TDP leaders: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి.. వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతుంది. ఎక్కడ చూసినా దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. పైగా వారికి పోలీసుల అండ కూడా ఉండటంతో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. శ్రీ రామనవమి పందిరి రాట విషయంలో ఏర్పడిన తగాదా ఉన్నట్టుండి.. తారాస్థాయికి చేరుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రణస్థలం మండలం కోష్ఠ గ్రామంలో ప్రజలు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి వేడుకలు చేయడం ఆ గ్రామంలో ఆనవాయితీ. అయితే ఈ ఏడాది వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను ఆహ్వానించకుండా వారు మాత్రమే శ్రీ రామ నవమి వేడుకలకు సంబంధించి పందిరి రాట వేయడంపై టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పందిరి రాట విషయంలో ఇరువర్గాలైన వైసీపీ, టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ కార్యక్రమం అందరూ కలసి చేయాలి.. కానీ వైసీపీ నాయకులు మాత్రమే చేయడపై టీడీపీ వర్గీయులు ఆగ్రహం చెంది.. ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వర్గాలు కలిసి వేడుకలు చేస్తున్నారు. ఈ సారి శ్రీ రామ నవమి వేడుకలు సర్పంచ్ ఆధ్వర్యంలో వైసీపీ వర్గీయులే చేస్తామని పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ వర్గంతో పోలీసులు దగ్గరుండి పందిరి రాట వేయించడంతో టీడీపీ నాయకులు.. హిందూ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏకపక్షాన పోలీసులు.. ప్రతీ సంవత్సరం గ్రామంలో ఇరు వర్గాల వారు కలిసి చేసేవారు కానీ ఇలా ఒక వర్గం వారే పందిరి రాట ఏర్పాటు చేయడం చాలా విచారకమైన విషయం.. అంతే కాకుండా పోలీసు వారే దగ్గరుండి ఇలా చేయడం భావ్యం కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు సరైనది కాదని దేవుని సన్నిధిలో అందరూ ఒక్కటే కానీ పోలీసులు అండతో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు.. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు సరైనది కాదని హిందూ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద స్వామి మండిపడ్డారు. పోలీసులు తీరుని ఖండిస్తూ నినాదాలు చేశారు. గ్రామాల్లో వైసీపీ అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. చివరకు పోలీసు రక్షణతో వైసీపీ వర్గీయులు శ్రీ రామనవమికి పందిరి రాట కార్యక్రమం ప్రారంభించారు.
ఇవీ చదవండి: