కరోనా.. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన మృతిచెందారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం జరిగింది. జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరినాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకునేవారు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కుటుంబసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు. స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెళ్లేందుకు ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా.. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక కుమార్తె వెళ్లి ఆయన గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే ఆయన తుదిశ్వాస విడిచాడు.
ఇదీ చదవండి: అక్రమ సంబంధం అనుమానమే విద్యార్థి హత్యకు కారణమా...?