‘ఉపాధి హామీ పనుల పేరుతో కూలీలు రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. అయినా కూలి డబ్బులు వచ్చేస్తున్నాయి’ అని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఉపాధి కూలీలనుద్దేశించి ఆయన శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకంలో వస్తున్న డబ్బులు వ్యవసాయ పనుల్లో సంపాదించాలంటే చాలా కష్టపడాలని, అందుకే ఎవరూ వ్యవసాయ పనులకు వెళ్లడం లేదన్నారు. ఫలితంగా కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పనులు వ్యవసాయ రంగానికి పెనుముప్పుగా మారాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పనుల సీజన్‌లో ఉపాధి హామీ పనుల నియంత్రణ అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ జె.నివాస్‌కి సూచించారు.
వైకాపా సర్కారు పాలనతో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి పాల్గొన్న కృష్ణదాస్.. రైతులను ఆదుకోవడం కోసమే సలహా మండలిని ఏర్పాటు చేశామన్నారు.
కృష్ణదాస్‌ను పదవి నుంచి తొలగించాలి: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
ఉపాధి హామీ పనులు చేసే వ్యవసాయ కార్మికులను కించపరిచేలా మాట్లాడిన ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌ను పదవి నుంచి తొలగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు పెత్తందారీతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కూలీలు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో ఎన్నో అవార్డులు వచ్చాయని గ్రహించాలని హితవు పలికారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందిన కూలీల పట్ల చులకనగా మాట్లాడిన కృష్ణదాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... 'తెదేపా తెచ్చిన ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం ప్రారంభిస్తోంది..'