సిక్కోలులో హిందువుల పండుగ.. దీపావళి పేరిట ఓ గ్రామం వెలిసింది. దశాబ్దాల కిందట శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళాన్ని అప్పట్లో సిక్కోలుగా పిలిచేవారు. సిక్కోలు రాజు కళింగపట్నం ప్రాంతానికి గుర్రంపై అప్పుడప్పుడు ఇదే ప్రాంతం మీదుగా వెళ్లేవారు. ఒక రోజు ఎండ తీవ్రతకు గుర్రంపై వెళ్తున్న రాజు.. ఓ కొబ్బరి తోటలోని విష్ణు దేవాలయం సమీపంలో స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు చూసి..రాజుకు సపర్యలు చేశారు. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదే రోజు దీపావళి పర్వదినం కావడంతో దాన్ని గుర్తు చేసుకున్న రాజు... ఈ గ్రామానికి దీపావళిగా నామకరణం చేస్తునట్లు ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ఈ గ్రామం దీపావళిగా కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం అదే పేరుతో నమోదైంది.
ఎక్కడుందంటే...
శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలో ఉన్న దీపావళి గ్రామంలో సుమారు 3 వందల గృహాలు, వెయ్యి మంది జనాభా ఉంటున్నారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరుతో తమ గ్రామానికి పేరు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని స్థానికులు అంటున్నారు. దీపావళి పండగను గ్రామస్థులంతా ఆనందోత్సాహలతో జరుపుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే అందరూ సంక్రాంతికి చేసే పూర్వీకులకు పిండ ప్రదానం.. ఈరోజే చేయడం ఇక్కడ అనావాయితీ. శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామ పంచాయతీ పరిధిలో మరో గ్రామం ఉంది.
ఇదీ చదవండి: