శ్రీకాకుళం జిల్లాలో 'గులాబ్' తుపాను తీరం దాటిందని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జిల్లాకు ఎక్కువ నష్టం వాటిల్లలేదని లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. తుపాను ప్రభావానికి పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయిందన్న కలెక్టర్.. అన్ని శాఖలు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గులాబ్.. సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య తీరం దాటిందన్న కలెక్టర్.. అయినప్పటికీ తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
జాతీయ విపత్తు నివారణ బృందాలు, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు సమవ్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వజ్రపుకొత్తూరుకు చెందిన ఆరుగురు మత్స్యకారులలో ప్రస్తుతానికి ఐదుగురు మత్స్యకారులు తీరానికి చేరుకున్నారని వెల్లడించారు. ఒక మత్స్యకారుడి ఆచూకీ మాత్రమే ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. 30 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు 15 వందల మంది ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్.. ఎటువంటి సమస్యలు ఉన్న కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.
- కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557
- జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933
ఇదీ చదవండి: