కొవిడ్ మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 9, 10వ తరగతి విద్యార్థులకు బోధన ప్రారంభమయ్యింది. పిల్లలు పాఠశాలలకు చేరగానే వారికి థర్మల్ పరీక్షలతో పాటు చేతులను శానిటైజ్ చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం వీడటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలలు ప్రారంభం కాకముందే.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేయించారు. పాజిటివ్ వచ్చిన 54 మంది ఉపాధ్యాయులు స్కూల్‌కు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని డీఈవో అన్నారు. బడికి వస్తున్న పిల్లల్లో ఇప్పటివరకు వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. పాఠశాలల్లో పర్యవేక్షణకు విద్యాశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందని..దాని ద్వారా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
"భోజనాల సమయంలో చేతులు సబ్బుతో కడగాలని పిల్లలకు చెబుతున్నాం. మధ్యాహ్నం భోజనం చేసేప్పుడు స్టెరిలైజ్ చేసిన ప్లేట్లని అందిస్తున్నాం. వడ్డించే వాళ్లకి చేతికి రోజూ కొత్త తొడుగులు, మాస్క్లు అందిస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి గమనించటం.. ఫోన్లు చేసి పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలి" - ఉపాధ్యాయుడు
"పాఠశాలల ప్రారంభానికి ముందుగానే ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలో రోజూ ఇద్దరు విద్యార్ధులకు కొవిడ్ పరీక్షలు చేయించాలని చెప్పారు. వైరస్ లక్షణాలు ఉన్న పిల్లలను బడికి రానివ్వట్లేదు. ప్రతి పాఠశాలలో భౌతికదూరం పాటించటం, మాస్క్లు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు" డీఈవో చంద్రకళ