Contaminated water in Srikakulam district: శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం పంచాయతీ పరిధిలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిశ్రమలు విడుదల చేసే హానికర వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం అవుతున్నాయి. దీంతో తాగేందుకు నీరు లేక మత్స్యకారులు దాహం కేకలు వేస్తున్నారు. వ్యర్థాలు కలిసిన నీటిని తాగడంతో పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గత వారంలో నలుగురు మత్స్యకారులు కలుషిత నీరు తాగి చనిపోవడంతో పరిశ్రమ మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం.. డి.మత్స్యలేశం పంచాయతీ పరిధిలో వైశాఖి బయోమెరైన్ ఫ్యాక్టరీ విడుదల చేసే హానికరమైన బయో వ్యర్థాలను.. గత కొన్ని సంవత్సరాలుగా నేరుగా భూగర్భంలోకి విడిచిపెడుతున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీంతో డి.మత్స్యలేశం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై వందలాది మంది మత్స్యకార కుటుంబాలు అంతు చిక్కని వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
కాలుష్య కోరల్లో కృష్ణమ్మ.. యథేచ్ఛగా మురుగునీరు నదిలోకి
గ్రామాల్లో బోరుబావుల నుంచి వచ్చే నీరు దుర్వాసన వెదజల్లడంతో.. స్నానానికి వాడినా చర్మ వ్యాధులు వస్తున్నాయంటూ మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామాల్లో అనారోగ్య కారణంగా వరుస మరణాలు చోటు చేసుకున్నా.. అధికారులకు పట్టడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఐదు గ్రామాల ప్రజలు.. ప్రతి రోజు తాగునీటి కోసం ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు వెచ్చించి నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. పరిశ్రమ కారణంగా.. డి. మత్స్యలేశం పరిధిలోని బావులలో నీరు తాగడానికి పనికిరాకుండా పోయిందని అంటున్నారు. బావులలో నీరు రసాయనాల వాసన వస్తోంది.
నిత్యం దోమలతో యుద్ధం.. అంతా మురుగునీరే.. పట్టించుకునే వారే లేరు..
వాటర్ క్యాన్లతో నీరు కొనుక్కోలేని వారు.. కలుషిత నీటిని తాగడం కారణంగా కిడ్నీ వ్యాధులు, చర్మవ్యాధులు వచ్చి కొద్దిరోజుల్లోనే చనిపోతున్నారని వాపోతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ.. ఎవరూ కూడా తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి కూడా తమ గ్రామానికి వచ్చి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి పరిశ్రమలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ గ్రామాలకు సురక్షితమైన నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. అలా చేయకుంటే.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం తప్ప.. మరో మార్గం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాల వలన జలచరాలు, ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయి. గత అయిదు సంవత్సరాలుగా మేము మా గ్రామంలోని నీళ్లు తాగడం లేదు. ఈ నీటితో స్నానం చేయడం వలన చర్మ సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వివిధ అవయవాలు ఫెయిల్ అయి చనిపోతున్నారు. వీటన్నింటికీ కారణం ఈ ఫ్యాక్టరీ. ఈ విషయాన్ని అధికారులకు చాలా సార్లు చెప్పాం. కానీ ఇప్పటి వరకూ ఏం చేయలేదు. దయచేసి మా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తారని కోరుతున్నాం". - మూర్తి, స్థానికుడు
దశాబ్దాలుగా దుర్వాసనతో జీవనం.. ఇంకెప్పుడు బాగుపడతాయి సార్ వాళ్ల జీవితాలు..?