శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం గ్రామంలో జరిగిన అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రొక్లెయిన్‌తో మృతదేహాన్ని తరలించడంపై కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుంది. స్పష్టమైన ప్రొటోకాల్ ఉన్నా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుసుకున్న సీఎంవో... బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నివాస్‌ను ఆదేశించింది. విచారణ జరిపిన అనంతరం పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్, పలాస శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌ను సస్పెండ్ చేశారు.
కఠిన చర్యలు తప్పవు...
ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించాల్సిన తీరు బాధించిందని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదన్నారు.
అసలేం జరిగింది?
ఉదయపురం గ్రామంలో శుక్రవారం ఒక వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు సిద్ధం కాగా.... మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. జిల్లా కలెక్టర్ నివాస్‌తో పాటు పలువురు అధికారులు అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు జేసీబీ సాయంతో మృతదేహాన్ని తరలించారు.
ఇదీ చదవండి