ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ప్రజలు ఏర్పాటు చేసిన బోనులో ఓ ఎలుగుబంటి చిక్కింది. గ్రామంలో తరచుగా ఎలుగుబంటి దాడులు చేయడం... ఆ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరికొంత మంది తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యారు.
ఎలుగుబంటి ప్రమాదం ఉన్న ప్రాంతాలకు అధికారుల నుంచి పూర్తి సహకారం అందకపోవటంతో ఎర్రముక్కాం గ్రామానికి చెందిన యువకులే ఎలుగును బంధించడానికి ఇనుప బోనును తయారు చేశారు. బోను ఏర్పాటు చేసిన సుమారు పది రోజుల తర్వాత బుధవారం రాత్రి ఎలుగు బోనులో చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు.
వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగు గట్టిగా అరుస్తుండటంతో గ్రామస్థులు ఎవరు బోను వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు.