Bear died: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎలుగుబంటి చనిపోయింది. ఈ ప్రాంతంలో మూడు రోజులుగా భల్లూకం బీభత్సం సృష్టించింది. ఒకరిని చంపి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. స్థానికుల ఆందోళనతో వేట ప్రారంభించిన అటవీశాఖ అధికారులు.. మంగళవారం ఉదయం భల్లూకాన్ని బంధించారు. పశువుల పాకలో నక్కిన ఎలుగుబంటికి తుపాకీ సాయంతో మత్తు ఇంజెంక్షన్ వేసి పట్టుకున్నారు. అనంతరం బోన్‌లో విశాఖ జూకు తరలిస్తుండగా దారిలో మృతి చెందింది. భల్లూకం చనిపోవడానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
ఎలుగుబంటి అంతకుముందు కిడిసింగి పరిసరాల్లో బీభత్సమే సృష్టించింది. తోటకు వెళ్తున్న కోదండరావు అనే వృద్ధుడిపై పొదల మాటు నుంచి వచ్చి దాడి చేసి చంపేసింది. ఆ మరుసటిరోజే.. వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయ సమీపంలో జీడి తోటలో పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తున్న ఆరుగురిని గాయపరిచింది. సాయం చేసేందుకు వెళ్లిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని.., వారి అరుపులు విని అక్కడకు వచ్చిన ఇద్దరు జవాన్లను తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అధికారులు అలసత్వం వహించారంటూ తొలుత ఆగ్రహించిన గ్రామస్తులు ఎలుగును పట్టుకోగానే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో మరో 2, 3 ఎలుగుబంట్లు ఉన్నాయని వాటినీ పట్టుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి