Bahuda Bridge Collapsed: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బహుదా నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కుప్పకూలిన ఘటనపై పలువురు నేతలు స్పందించారు. ఈ ప్రమాదం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు పలువురు జనసేన నాయకులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్ఛాపురంలో బహుదా నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కుప్పకూలిపోయింది. 1929 సంవత్సరంలో నిర్మించిన ఈ వంతెనపై 100 టన్నుల బరువున్న భారీ గ్రానైట్ లోడ్‌తో వాహనం ప్రయాణించింది. దీంతో ఒక్కసారిగా బహుదా వంతెన కుప్పకూలిపోయింది. బుధవారం తెల్లవారుజామున 5.20 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం వారు సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం వల్ల ఇచ్ఛాపురం-పలాస మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కుప్పకూలిన బహుద వంతెనను నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. కేవలం 10 టన్నుల బరువున్న వాహనాలు మాత్రమే వంతెనపై వెళ్లాల్సి ఉండగా.. 100 టన్నుల బరువు గల గ్రానైట్ లోడుతో వాహనం ఎలా వంతెన పైకి అనుమతించారని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూలిన బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జిని నిర్మించాలని ఆయన అన్నారు.
మరోవైపు కూలిన బహుద వంతెనను పరిశీలీంచిన ఎమ్మెల్సీ నర్తు రామారావు.. ఈ దురదృష్టకర సంఘటన గురించి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా.. వంతెనకు ఇరువైపులా రాకపోకలు జరపకుండా ఉండేందుకు అధికారులు అడ్డుగోడలు నిర్మించారు. ఈ ఘటనపై జనసేన నేతలు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆందోళనలు చేశారు. ప్రభుత్వం వెంటనే కొత్త బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని జనసేన నాయకుడు దాసరి రాజు డిమాండ్ చేశారు.
"అధికారుల ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బహుదా వంతెన కుప్పకూలిపోయింది. కేవలం 10 టన్నుల బరువున్న వాహనాలు మాత్రమే వంతెనపై వెళ్లాల్సి ఉండగా 100 టన్నుల బరువు గల గ్రానైట్ లోడుతో వాహనం ఎలా వంతెన పైకి అనుమతించారు..? ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కూలిన బ్రిడ్జికి సమాంతరంగా నూతన బ్రిడ్జిని నిర్మించాలి." - డాక్టర్ బెందాళం అశోక్, ఎమ్మెల్యే
"బహుదా నదిపై బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన కూలిపోయిన విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం దీనిపై అన్ని ఏర్పాట్లు చేస్తోంది." - నర్తు రామారావు, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: