కంటి శస్త్ర చికిత్సలు చేయించుకుందామనుకునే సిక్కోలు వాసులను ఓ సమస్య వేధిస్తుంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ఆసుపత్రిలో పది పడకలతో నేత్ర శస్త్ర చికిత్స విభాగాన్ని 1995లో ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్సలు బాగా జరుగుతుండడం వలన నిరుపేద వృద్ధులు ఎక్కువగా ఈ ఆసుపత్రిని ఆశ్రయిస్తుంటారు.
ఈ ఏడాది మార్చి వరకు నెలకు వందకుపైగా శస్త్ర చికిత్సలు జరుగుతుండేవి. గత అయిదు నెలలుగా ఆ సేవలు నిలిచిపోయాయి. దృష్టి లోపంతో బాధపడుతున్న వృద్ధులకు నేత్ర పరీక్షలు చేసి మందు ఇవ్వడం మినహా మరేదీ చేయలేకపోతున్నారు. శస్త్రచికిత్స విభాగం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పి బాధితులను పంపించేస్తున్నారు.
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నేత్రవైద్య విభాగంలోని శస్త్రచికిత్సలు నిర్వహించే భవనం పాడుబడింది. ఇటీవల వర్షాలకు మరింత శిథిలమై వర్షం నీళ్లు భవనం లోపలికి వస్తున్నాయి. బాధితులు, సిబ్బంది వినతి మేరకు 15 మందిని ఇన్‌పేషంట్లుగా ఉంచే విధంగా వసతి ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలపై ఈ ఏడాది మార్చిలో భవనానికి మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంత మేర పనులు చేపట్టి ఒక శస్త్ర చికిత్స గదిని రెండుగా మార్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఫలితంగా.. జిల్లా నలుమూలల నుంచే వచ్చేవారే కాకుండా... ముఖ్యమంత్రి ఐ విజన్ కేంద్రాలైన రణస్థలం, రాజాం, పాతపట్నం, పలాస, ఆముదాలవలస, ఇచ్ఛాపురం నుంచి శస్త్రచికిత్సకు వచ్చే బాధితులకూ.. నిరాశే ఎదురవుతోంది. దాదాపు 500 మంది.. మెరుగైన వైద్యం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో తర్వలోనే పనులు పునఃప్రారంభం అవుతాయని చెప్పారు. ఆ ఆదేశాలేవో త్వరగా వచ్చేలా చూడాలని ఉన్నతాధికారులు బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: