శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గిరిజన గ్రామాల పరిధిలోనే ఎక్కువగా సరిహద్దు గ్రామాలున్నాయి. సంబంధిత గ్రామాలకు చెందిన పిల్లలు దశాబ్దాల తరబడిగా అమ్మమ్మ ఇళ్ల వద్దనే ఉంటూ ఆంధ్ర ప్రాంత పాఠశాలల్లోనే చదువుతున్నారు. పేదరికం, ఉపాధి ఇబ్బందులు ఇతర అంశాల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఇక్కడ ఉంటున్నారు. కొందరు సంబంధిత గ్రామాలకు దగ్గరలో ఒడిశా ప్రభుత్వ పాఠశాలలు లేక, మరికొందరు ఇక్కడ కుటుంబ మూలాలు ఉన్నందున జిల్లా విద్యా సంస్థలలోనే చదువుతున్నారు. సంబంధాలు చేసుకునే మహిళల పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒడిశాలో ఆధార్ నమోదు చేయించుకున్న కుటుంబాల పరంగా చదువులతో పాటు వివిధ పథకాలకు నిబంధనలు ఆటంకంగా మారుతున్నాయి.
పది మండలాల పరిధిలో..
జిల్లాలో 10 మండలాల పరిధిలో సరిహద్దు గ్రామాలకు చెందిన విద్యార్ధులు ఇక్కడే చదువుతున్నప్పటికీ అమ్మఒడి ప్రయోజనం అందడం లేదు. ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు అందుతున్నాయి. జగనన్న కానుకతో పాటు ఇతర విద్యాపరమైన ప్రయోజనాలు అందుతున్నప్పటికీ అమ్మఒడి నిధులు మాత్రం అందడం లేదు. ఇక్కడ ఆధార్ నమోదు లేనందున వారికి ఆర్థిక ప్రయోజనం అందించేందుకు నిబంధనలు అడ్డు వస్తున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అవగాహనలోపం, నిరక్షరాస్యత కలిగిన కుటుంబాలు ఒడిశాలో నమోదు చేయించుకోవడంతో ఇక్కడ ప్రయోజనాలు అందుకోలేక పోతున్నారు. సాధారణ పాఠశాలలతో పాటు కేజీబీవీ విద్యాసంస్థలు, మోడల్‌స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న సరిహద్దు గ్రామాల విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనం అందడం లేదు.
అన్ని సదుపాయాలు అందించి..
మా పాప ఒకటో తరగతి నుంచి సాగరనౌగాం పాఠశాలలోనే చదువుతుంది. ఈ ఏడాది ఐదో తరగతికి వచ్చింది. పుస్తకాలు, దుస్తులు, జగనన్న ఇతర కానుక ఇచ్చారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రేషన్ ఇస్తున్నారు. అమ్మఒడి డబ్బులు మాత్రం బ్యాంకు ఖాతాలో వేయడం లేదు. -- పింకి, కొనక పంచాయతి
సరిహద్దు విద్యార్ధులకు ఇక్కడే అవకాశం
ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు. ఓటర్ల నమోదు, ఇతర అంశాల దృష్ట్యా అక్కడ ఆధార్ నమోదు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్ర పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అమ్మఒడి పథకం అమలు జరపాలని విద్యామంత్రితో పాటు ఉన్నతాధికారులను కోరాం. -- బృందావన్ దొళాయి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ఒడియా టీచర్స్ అసోసియేషన్.
నమోదు లేనందునే...
అమ్మఒడి పథకం అమలుకు జిల్లాలో ఆధార్ నమోదు తప్పనిసరి సరిహద్దు ప్రాంతాలకు చెందిన విద్యార్ధుల ఆధార్ నమోదు ఇక్కడ లేక వారికి ఆర్ధిక ప్రయోజనం అందడం లేదు. -- కుసుమ చంద్రకళ, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం
ఇవీ చదవండి..