Amaravati Formers: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ప్రార్థించినట్లు ఐకాస నేతలు తెలిపారు. ఆంక్షల పేరుతో రైతుల యాత్రను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఉద్యమ నేత గద్దె తిరుపతిరావు ఒక్కరే దాన్ని పూర్తి చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాజకీయ లబ్ధి కోసమే 3 రాజధానుల నాటకానికి తెరలేపారని ఐకాస నేతలు మండిపడ్డారు. త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి టు అరసవల్లి పాదయాత్ర: అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలంటూ రాజధాని రైతులు చేపట్టిన అమరావతి టు అరసవల్లి పాదయాత్రను అమరావతి పరిరక్షణ సమితి నేత తిరుపతిరావు పూర్తి చేశారు. ఈనెల 11న కాలినడకన యాత్రను ప్రారంభించిన ఆయన శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలికి చేరుకున్నారు. అక్కడి నుంచి అరసవల్లి దేవాలయం వరకు 2 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో స్థానిక రైతులు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. మార్గమధ్యలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ అమరావతి ఉద్యమ నేతలు ముందుకు సాగారు.
అభివృద్ధిని గాలికొదిలేసి దోపిడీ: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఐకాస నేతలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం బైట ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాజకీయ లబ్ధి కోసమే 3 ముక్కలాట ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వం పబ్బంగడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతే చోదకశక్తి అని స్పష్టం చేశారు.
అన్ని జిల్లాల్లో పర్యటన: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి