Achennaidu comments on YCP: ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి శనిలా దాపురించారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మూడున్నరేళ్లలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా.. జే టాక్స్‌కు, జే గ్యాంగ్‌కు భయపడి పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ వైకాపా ప్రభుత్వం విఫలమైందని అచ్చెన్నాయుడు అన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని నిప్పులు చెరిగారు. ఆనాడు విశాఖలో మూడు భాగస్వామ్య సదస్సులు పెట్టి 32 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలని 15.45 లక్షల కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నామని, ప్రభుత్వం మారాక ఎక్కడా ఒక్క పరిశ్రమ స్థాపించ లేదని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 39,450 పరిశ్రమలు పెట్టి, 5 లక్షల 133 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి ఆనాడు శాసనసభలో ప్రస్తావించిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. సాక్షి పాలే గాడు, సకల జనాల మంత్రి సజ్జల.. అమర్ రాజా బ్యాటరీ కంపెనీని రాష్ట్రంలో ఉండనివ్వమని చెప్పారని, కాలుష్యం పేరుతో బయటకు వెళ్లగొట్టి పూర్తిగా విచ్ఛిన్నం చేశారని అన్నారు. వీళ్ళ ధన దాహానికి, దురహంకారానికి భయపడే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు.
ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లినా యువత తండోపతండాలుగా వచ్చి మద్దతు పలుకుతున్నారని, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం గాడిన పడుతుందని భావిస్తున్నారని చెప్పారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు.
రాష్ట్రానికి సీఎం జగన్ శనిలా దాపురించారు. పరిశ్రమలు రాష్ట్రం వదిలి తరలిపోతుంటే.. క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా పోలీస్ నోటిఫికేషన్ వేయకుండా ఇప్పుడు ఇచ్చారు. చాలామంది నిరుద్యోగులు అవకాశం కోల్పోతున్నారు. జగన్ పరిపాలన వచ్చిన నాటి నుంచే నిరుద్యోగులకు పోలీసు రిక్రూట్మెంట్కు అవకాశమివ్వాలి. -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: