లంచం తీసుకుంటూ రెవెన్యూ ఉద్యోగి, అనిశా (అవినీతి నిరోధక శాఖ) అధికారులకు దొరికిపోయిన సంఘటన భామిని మండలం కోసలి సచివాలయంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం అనిశా డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్. రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ‘తన తండ్రి చనిపోయారని, ఆయన పేరుమీదున్న భూమి 0.90 సెంట్లు తన పేరు మీదకు మార్చాలని’ కోసలి గ్రామానికి చెందిన జి.దుర్గాప్రసాద్ కోరారు.
సచివాలయంలో అన్ని రకాల పత్రాలు అప్‌లోడ్ చేయించారు. వీఆర్వో కె.రమణయ్య వాటిని తొలగించి, పేరు మార్చాలంటే రూ.2,400 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండ్రి అంత్యక్రియలకే అప్పులు చేశానని, మీరు అడిగింది ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పాడు. నెలల తరబడి తిరిగినా పనికాలేదు. విసిగిపోయిన బాధితుడు ‘మీరు అడిగిన సొమ్ము ఇస్తాను నా పని చేసి పెట్టండి’ అంటూ వీఆర్వోకి చెప్పాడు.
అనంతరం... బాధితుడు శ్రీకాకుళం అనిశా అధికారులకు సమాచార మిచ్చారు. వీఆర్వో రమణయ్యకు మంగళవారం డబ్బులు ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో వీఆర్వోను హాజరుపర్చనున్నట్లు వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐ హరి, ఎస్‌ఐలు చిన్నమనాయుడు, సత్యారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: