Lokesh Interaction at Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో కొనసాగుతోంది. చీకటి మానిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాగంగా గంగసానిపల్లి వద్ద టమోటా రైతులతో నారా లోకేశ్ మాట్లాడారు ఎక్కువ మంది రైతులు సాగుచేసే టమోటా పంటకు గిట్టుబాటు ధర లభించాలంటే ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైతుల అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్ పరిశీలించి ప్రభుత్వం రాగానే తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వేల సంఖ్యలో ప్రజలు: బిసనవారిపల్లి వద్ద బలిజ సామాజిక వర్గానికి చెందిన వారితో నారా లోకేశ్ మాట్లాడారు. బలిజలను బీసీల జాబితాలో చేర్చే అంశంతో పాటు ఈ డబ్ల్యుఎస్ కోటాకు సంబంధించిన సమస్యను బలిజలు లోకేశ్‌కి వివరించారు. కొక్కంటి క్రాస్‌కు యువగళం పాదయాత్ర చేరుకోగానే లోకేశ్‌ను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అందరికీ అభివాదం తెలియజేస్తూ.. మహిళలను పలకరిస్తూ పాదయాత్ర కొనసాగింది.
సమస్యలను సావధానంగా విని: కొక్కంటి క్రాస్ సమీపంలో ఎస్టీలతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేశ్ వారి సమస్యలను సావధానంగా విన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో తండాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎస్టీలను వంచించిన విధానాన్ని తెలియజేశారు. ఎస్టీల భూములు అన్యాక్రాంతమవుతున్న విషయాన్ని లోకేశ్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు.
బిల్లులన్నీ వడ్డీతో సహా చెల్లిస్తా: తండాలలో ఆలయాల నిర్మాణం పూజలు నిర్వహించే వారికి వేతనాలు అంశం పైన చర్చ సాగింది. దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు సంవత్సరాలు పడుతుందని ఓ మహిళ లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన లోకేశ్.. ధ్రువీకరణ పత్రం తాను ఇప్పిస్తానంటూ ఆమె వివరాలను తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోని రాగానే అన్ని విధాలా రైతును మోసగిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించినటువంటి బిల్లులను వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను తాను తీసుకుంటానని అన్ని వర్గాలు తమను ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పాటునివ్వాలని కోరారు.
"స్వయం ఉపాధి లేదు. ప్రభుత్వం రంగంలో ఉద్యోగాలు లేవు. ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇది గిరిజనుల సమస్య మాత్రమే కాదు.. ఆంధ్ర రాష్ట్ర యువత సమస్య. ఈ ఇబ్బంది అందరికీ ఉంది. అందుకే బాబు గారిని గెలిపించాలి. మళ్లీ పరిశ్రమలు మన ప్రాంతానికి తీసుకురావాలి. దానిలో ఎటువంటి సందేహం లేదు. నిన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు చూసినాం. తీర్పు ఏంటే క్లారిటీ వచ్చిందా అందరికీ. అంటే గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఎంత ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు అనే దానికి ఇదో నిదర్శనం. ఒక తిరుగుబాటు వచ్చింది". - నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: