LOKESH YUVAGALAM PADAYATRA : రాష్ట్రంలో యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర నేటికి 56వ రోజుకి చేరుకుంది. పాదయాత్రలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుచోట్ల గజమాలలతో స్వాగతాలు పలుకుతున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటన్నింటినీ అధిగమించి పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అలాగే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెట్టినా వాటిని చిరునవ్వుతో స్వీకరించి నిర్విరామంగా లోకేశ్ తన జైత్రయాత్రను సాగిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో.. లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో 56వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని సీకే పల్లిలో నారా లోకేశ్‌కు ప్రజలు.. తెలుగుదేశం పార్డీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా లోకేశ్‌కు పులమాలలు, హారతులతో జనం నీరాజనాలు పలుకుతున్నారు. లోకేశ్‌ని చూసేందుకు.. మాట్లాడేందుకు మహిళలు, వృద్దులు, పెద్ద ఎత్తున సీకే పల్లి కూడలికి వచ్చారు. దారి పొడవునా లోకేశ్ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు పెరిగి బిల్లు కట్టలేకపోతున్నామని, పెన్షన్లు తొలగించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం ఉప్పరవాండ్ల కొట్టాల వద్ద సత్యసాయి నీటి సరఫరా కార్మికులతో లోకేశ్ సమావేశం అవుతారు. ప్యాదిండి సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు. అనంతరం ప్యాదిండి శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకుంటారు.
కాళ్లకు బొబ్బలు వచ్చినా.. యువగళం మహాపాదయాత్రలో లోకేశ్ ఎక్కడా ఆగకుండా నిర్విరామంగా పాదయాత్ర చేయడం వల్ల కాళ్లకు బొబ్బలు వచ్చాయి. బొబ్బలు తగ్గే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించినా.. పాదయాత్ర ఆపడం కుదరదని.. కొనసాగించేందుకే లోకేశ్ మొగ్గు చూపారు. బొబ్బలతోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రోజుకు సగటున 15 కిలోమీటర్ల మేర లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.
సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన.. యువగళం పాదయాత్రలో భాగంగా చేపడుతున్న సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. లోకేశ్‌తో ఫొటో దిగి దానిని యువత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటంతో.. ప్రతి రోజూ వీక్షకుల సంఖ్య 5 లక్షలపైనే ఉంటోదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రోజుకు కేవలం 200మంది వరకే ఉంటారనే అంచనాతో చేపట్టిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు 3వేల వరకు చేరుకోవటంతో పాదయాత్ర ప్రారంభ సమయానికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు లోకేశ్‌ను రహస్యంగా కలిసి సమస్యలు చెప్పుకునే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది.
ఇవీ చజవండి: