Farmer Suicide Attempt: శ్రీ సత్య సాయి జిల్లా.. ధర్మవరం నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలలో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి.. రైతుల పొలాల్ని కూడా వదలడం లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు సూర్యనారాయణ ఆరోపించారు. తన పొలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యేను వేడుకున్నా.. వినకుండా తవ్వకాలు జరపడంతో ఉప్పలపాడుకు చెందిన రైతు లక్ష్మీనారాయణ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
మెరుగైన వైద్యం కోసం అతనిని అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో తరలించారు. బీజేపీ నేత సూర్యనారాయణ.. ఆ రైతును పరామర్శించి.. మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. ఇసుక తవ్వకాల్లో రైతుల పొలాలను కూడా వదలడం లేదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి, ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు వేడుకుంటున్నా.. కనికరించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వీటన్నింటి పైనా.. రైతులకు న్యాయం జరిగేలా హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.
"ఏదైతే ప్రభుత్వం ఇసుక అమ్ముకోడానికి పెట్టిందో.. అందులో భాగంగా కేవలం పూడిక తీసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ స్థానిక శాననసభ్యుడు పూర్తిగా తవ్వేస్తున్నాడు. అదే విధంగా కేవలం ఒక్క అనంతపురంలోనే అమ్మాలి.. కానీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పంపించే పరిస్థితి ఈ రోజు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా లక్ష్మీ నారాయణ సొంత పొలంలో కూడా ఇసుకు తీస్తున్నారు. ఆయన గత పది రోజులుగా అడ్డు పడుతూ ఉంటే.. పోలీసులతో ఆయనని పక్కకి తోసేసి ఇసుక ఎత్తారు. దీంతో రైతు లక్ష్మీనారాయణ ఈ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
వీళ్ల ధన దాహం ఎలా ఉందో చూడండి. దీనిపై మేము తప్పకుండా.. ఎన్జీటీలో కూడా ఫిర్యాదు చేస్తాం. దాంతో పాటు హైకోర్టులో కూడా వేసి.. తప్పకుండా రైతుకు న్యాయం జరిగేలా చేస్తాం. అదే విధంగా తొందరలోనే ఏదైతే ఆ రీచ్‌లలో.. అక్రమంగా ఇసుక ఎత్తుతున్నారో.. వాటిన్నింటిపైనా మేము అక్కడ ధర్నా కూడా చేస్తాం". - సూర్యనారాయణ, బీజేపీ నేత
ఇవీ చదవండి: