YCP Leaders Attack on Army Jawan: దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్ ఓ నేరస్థుడి చేతిలో గాయపడి ఆసుపత్రి పాలైతే.. దాడి చేసిన వ్యక్తి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడని ఇటీవల వైసీపీ నాయకులు దాడిలో గాయపడిన ఆర్మీ జవాన్ సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామానికి చెందిన సమరసింహారెడ్డి జవాన్‌గా కశ్మీర్లో పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామంలో జాతర ఉండటంతో స్వగ్రామానికి వచ్చారు. జాతర సమయంలో వాహనం అడ్డు తీయమన్నందుకు మనసులో పెట్టుకొని జెడ్పీ వైస్ ఛైర్మన్ వైసీపీ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని వాపోయారు. దీంతో ఈ ఘటనపై ఆర్మీ జవాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. దేశం కోసం ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి సరిహద్దులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికుడిపై సొంత దేశంలో సొంత ఊరిలో దాడి చేస్తే.. ఇలాంటి స్పందన ఉంటుందని.. అనుకోలేదని సమరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దాడి కారణంగా సుమారు అతను ఆరు నెలల పాటు తనకు కోలుకుని అవకాశం లేదని చెప్పారు. దేశం కోసం సేవ చేసే వ్యక్తిని ఇలా ఆసుపత్రి పాలు చేసిన వ్యక్తి మాత్రం స్వేచ్ఛగా కాలర్ ఎగిరేసి బయట తిరుగుతున్నాడని ఆయన అన్నారు. ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండి.. ఇసుక దందాలు, గుట్కా, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తికి పోలీసులు అండగా నిలవడం తనను తీవ్రంగా కలిచివేస్తోందని వీడియో ద్వారా ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.
" దేశానికి చేసే ఆర్మీ జవాన్ ఓ నేరస్థుడి చేతిలో గాయపడి హాస్పిటల్ పాలైతే.. దాడి చేసిన వ్యక్తి ధర్జాగా బయట తిరుగుతున్నాడు. ఇటీవల వైసీపీ నాయకులు నాపై దాడి చేశారు. కశ్మీర్లో జవాన్‌గా పనిచేస్తున్న.. నేను ఇటీవల గ్రామంలో జాతర ఉందని స్వగ్రామానికి వచ్చాను. జాతర సమయంలో వాహనం అడ్డు తీయమన్న విషయం మనసులో పెట్టుకుని జెడ్పీ వైస్ ఛైర్మన్, అతని అనుచరులు నాపై తీవ్రంగా దాడి చేశారు. అయితే ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు నామమాత్రంగానే కేసులు నమోదు చేశారు." - సమరసింహారెడ్డి, ఆర్మీ జవాన్
ఇవీ చదవండి: