Internal fight in YSRCP: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వారికూటి అశోక్ బాబు ఈ కార్యక్రమాన్ని మిట్టపాలెంలో నిర్వహించేందుకు ముందుగా షెడ్యూల్ ప్రకటించారు. మరో వర్గానికి చెందిన మాదాసి వెంకయ్య వర్గం ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ 'మా ఇంటికి రావొద్దు' అంటూ స్టిక్కర్లు అంటించారు. దీంతో గ్రామంలో రెండు వర్గాలుగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి బాగా లేకపోవడం వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని అశోక్ బాబును పోలీసులు కోరారు. అయినప్పటికీ అశోక్ బాబు పట్టించుకోకుండా తన అనుచరులతో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారం చేయబోయారు.
నిలదీసిన గ్రామస్థులు.. అశోక్ బాబు పర్యటన నేపథ్యంలో గ్రామంలో చాలా మంది.. స్థానిక నాయకులు లేకుండా మీరొక్కరే ఎందుకు వచ్చారు..? అసలు మా నాయకుడు ఎవరు..? అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. నేనే మీ నాయకుడిని.. పథకాలు మీకు అందలేదా?? అందితే ప్రశ్నలు ఎందుకు వేస్తారని అశోక్ బాబు విరుచుకుపడ్డారు. పథకాలు మీ వల్ల రాలేదు.. ప్రభుత్వం ఇచ్చినవి అంటూ జనం సమాధానాలు చెప్పడంతో అశోక్ బాబు వారితో వాదనకు దిగారు. రెండు వర్గాలు వాదోపవాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు నెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టగా.. కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఇద్దరు మీడియా ప్రతినిధులపై అశోక్ బాబు వర్గం దాడి చేసింది. కెమెరా గుంజుకొని ధ్వంసం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. అశోక్ బాబు రెచ్చగొట్టే విధంగా నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
భగ్గుమన్న విభేదాలు... సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. వర్గ పోరు నువ్వా.. నేనా..! అనేంతగా తారాస్థాయికి చేరుకుంటోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుల్లో అంతర్గత విభేదాలు వెలుగుచూశాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్బాబు కొండెపి మండలం మిట్టపాలెంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా పార్టీలోని మరో వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. అశోక్ బాబు పర్యటనను వ్యతిరేకిస్తూ మాదాసి వెంకయ్య వర్గం ఇంటింటికీ పోస్టర్లు అంటించింది. అశోక్బాబు మా ఇంటికి రావొద్దంటూ పోస్టర్లు వేయగా.. ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పర్యటనను వాయిదా వేసుకోవాలని అశోక్ బాబుకు సూచించగా ఆయన ససేమిరా అనడంతో ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో జిల్లా కేంద్రం నుంచి భారీగా స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను రప్పించారు.