మాస్క్ పెట్టుకోనందుకు పోలీసులు కొట్టటంతో తమ కుమారుడు అపస్మారకస్థితికి చేరుకున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పరిధిలో ఈ ఘటన జరిగింది.
భాదితుడి తండ్రి మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం... చీరాల థామస్పేటకు చెందిన వై.కిరణ్ కుమార్, వి.షైని అబ్రహం ద్విచక్రవాహనంపై కొత్తపేటకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొత్తపేట పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసు సిబ్బంది వీరిని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ తలపై ఎస్ఐ కొట్టటంతో తీవ్రగాయమై అపస్మారకస్దితికి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు.
ఘటనపై పోలీసుల స్పందన మరోలా ఉంది. మద్యం మత్తులో బైక్పై వస్తున్న కిరణ్కుమార్, షైనీని తమ సిబ్బంది ఆపటంతో వాగ్వివాదానికి దిగారని చీరాల రెండో పట్టణ ఎస్ఐ విజయకుమార్ చెప్పారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా తనపైనా దురుసుగా వ్యవహరించారని వెల్లడించారు. వారిని జీపులో పోలీసు స్టేషన్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిరణ్ కుమార్ వాహనం నుంచి దూకేశాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతని తల రహదారికి తగిలి గాయమైందని ఎస్ఐ విజయకుమార్ వివరించారు.
ఇదీ చదవండి