ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెంలో వెయ్యి మంది జనాభా, 450 ఓటర్లు ఉన్నారు. ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతుల భూములు వెయ్యి ఎకరాల వరకు ఉన్నాయి. ఈ భూములన్నీ కొండి కందుకూరు, కోవూరు, జిల్లెలముడి తదితర 5 రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. దీనివల్ల పొలాలకు సంబంధించి ఏ అవసరానికైనా ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
స్పందన లేదు...
రికార్డులు గ్రామ పరిధిలో లేకపోవడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలన్నీ ఒకే సరిహద్దులోకి తీసుకొచ్చి, తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని గ్రామస్థులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను, ప్రజా ప్రతినిధులను పలుమార్లు కలిసి విన్నవించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎవరూ స్పందించకపోవటంతో సమస్య అలానే మిగిలిపోయింది.
అంతా సజావుగానే ఉందనుకున్న సమయంలో..
8 సర్పంచ్, 8 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అన్నీ ఆమోదం పొందాయి. అంతా సజావుగా ఉందనుకున్న తరుణంలో.. నామినేషన్ల ఉపసంహరణ రోజు అన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. అందరూ కలిసి మూకుమ్మడిగా తమ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ పంచాయతీ స్థానాలకు పోటీ చేసేందుకు ఎవరూ లేకుండాపోయారు. ఈ కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
షాకైన అధికారులు..
ఊహించని పరిణామంతో కంగుతిన్న అధికారులు గ్రామస్థులను ప్రశ్నించగా.. తమ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేసినట్లు చెప్పారు. ఇంతకీ ఆ గ్రామస్థుల సమస్యలను పరిష్కరించి అధికారులు అక్కడ ఎన్నికలు నిర్వహిస్తారా..? లేదా..? అనేది తేలాలంటే కొంత సమయం వేచి చూడాలి.
ఇవీ చూడండి...