వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గెజిట్లో(నదీ యాజమాన్య బోర్డులో) చేర్చాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు దేశం కార్యకర్తలు ప్రకాశం జిల్లా, గిద్దలూరులో ర్యాలీ నిర్వహించారు. స్థానిక క్లబ్ రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రకాశానికి తాగునీరు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని నినాదాలు చేశారు.
రాయలసీమ కోసం..ప్రకాశం రైతుల్ని బలి చేస్తారా?
వెలిగొండ ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాంతానికి 55 వేల క్యూసెక్కుల నుంచి 80 క్యూసెక్యులకు పెంచడాన్ని నిరసిస్తూ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇలా చేయడం వల్ల ప్రకాశం పశ్చిమ రైతులు నష్టపోతారన్నారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీదున్న ప్రేమ ఈ వెలిగొండ ప్రాజెక్టుపై లేకపోవడం దారుణమన్నారు. కేంద్ర జలవనరుల శాఖ గెజిట్లో ఈ వెలిగొండ ప్రాజెక్టు లేకపోవడం చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వెలిగొండ ప్రాజెక్టును కూడా గుర్తించాలన్నారు. లేదంటే నిరసనలు దశలవారీగా ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: cbn on gazette: 'జలశక్తి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం'