ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో జక్కి కాశీశ్వరరావు( 28) అనే యువకుడిని పట్టపగలు హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. కంభం మండలం పొరుమామిల్లపల్లి గ్రామానికి చెందిన కాశీశ్వరరావు బైకుపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన జక్కి కరుణాకర్ తన కారుతో ఢీ కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. కాశీశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తన చెల్లెలిని వేధిస్తున్న కాశీశ్వరరావును కరుణాకర్ పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు.
పక్కా ప్లాన్ తో హత్య... కత్తితో పొడిచి పరార్
చీరాల మండలం తోటవారిపాలెం కృపానగర్ సమీపంలో పట్టపగలు దారుణం జరిగింది. ఎన్. దినేష్ (20)అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు. మృతుడు చీరాల హరీష్పేటకు చెందిన యువకుడిగా గుర్తించారు. తోటవారిపాలెంకు చెందిన ఒక మిత్రుడి ద్వారా ఫోన్ రావడంతో దినేష్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెదుళ్లపల్లికి బయలుదేరాడు. కృపానగర్ సమీపంలోకి రాగానే ముగ్గురు దుండగులు ఒక్కసారిగా కత్తితో గొంతుపై పొడిచి పరారయ్యారు.