తనకు జీవనాధారం అయిన ఆవు మృతి చెందడటంతో బాలమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు ప్రవాసాంధ్రులు స్పందించి రెండు ఆవులను అందించి మానవత్వం చాటుకున్నారు.. తర్లుపాడు మండలం నాగేండ్ల ముడిపి గ్రామంలో నివాసం ఉండే గంగిరెద్దుల కుటుంబానికి చెందిన బాలమ్మ ఒంగోలు మంగమూరు రోడ్డులో బస ఏర్పాటు చేసుకుని తన ఆవుతో ఇంటింటికి తిరిగి జీవనం సాగించేవారు. గత నెల 27న తన ఆవు దూడకు జన్మనిచ్చింది.. తదనంతరం ఈ నెల 2న అవును వైద్యం కోసం తీసుకెళ్లి తిరిగి వస్తూ.. ఒంగోలు ఎస్పీ కార్యాలయం సమీపంలో హఠాత్తుగా రోడ్డుమీద ఆవు చనిపోయింది. తనకు జీవనాధారంగా ఉన్న ఆవు మరణంతో తల్లడిల్లిన విషయాన్ని ఈనాడు, ఈటీవిలో ప్రముఖంగా రావడంతో పలువురు దాతలు స్పందించారు... అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు ఆమెకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కన్సెల్టెంట్‌గా పనిచేస్తున్న ముక్కామల కోటేశ్వరరావు తన స్నేహితుల సహకారంతో బాలమ్మకు ఆవును అందజేసారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఆయనకు తెలంగాణలో చేవెళ్ళ వద్ద సేంద్రీయ పాల డెయిరీ కూడా ఉంది. ఓ వ్యాన్‌తో ఆవును ఒంగోలుకు తరలించి బాలమ్మకు అందించారు.. అలాగే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాగులప్పలపాడు మండలం బి. నిడమనూరుకు చెందిన గుత్తికొండ హేమ వెంకటబుజ్జిరెడ్డికూడా ఒంగోలు జాతి ఆవును బాలమ్మకు అందించారు. తన స్నేహితులైన ఉపాధ్యాయులు కె.రాము, రామాంజనేయుల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం ఆవును బాలమ్మకు అందజేశారు. ఒకే రోజు రెండు ఆవులు అందుకున్న బాలమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఈ సందర్భంగా బాలమ్మ మాట్లాడుతూ.. దూడతో పాటు, దాతలు ఇచ్చిన రెండు ఆవుల్నీ కన్నబిడ్డల్లా చూసుకుంటాననంటూ కోటేశ్వరరావుకు, బుజ్జిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: 'ఓ ప్రజాప్రతినిధి మా స్థలం కబ్జా చేశారయ్యా'