ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏఆర్ ఏఎస్ఐగా పనిచేస్తున్న కల్లూరి రవి... ఇండియన్ పోలీస్ మెడల్ సాధించారు. పోలీస్‌శాఖకు ఆయన అందించిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మెడల్‌తో సత్కరించింది. ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన ఈయన... 1989లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఏఆర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తునే... అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టిపెట్టారు. సాంకేతిక సహకారం ఉంటే ఎన్నో కేసులు ఛేదించవచ్చునని ప్రయోగాలు చేశారు. నేర పరిశోధనలో సాంకేతిక పాత్ర లేని రోజుల్లో ఆయన... పలు కీలక కేసుల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అప్పట్లో ఎస్పీగా పనిచేసిన మహేష్ చంద్ర లడ్డాను చంపేందుకు మావోలు మందుపాతర పెట్టారు. ఈ హత్యాయత్నం కేసు ఛేదనలో రవి కీలకంగా వ్యవహరించారు. కాల్ డేటా ఎనాలసిస్ను జిల్లాలో తొలిసారిగా వినియోగించారు. ఇలా పలు కీలక కేసుల్లో రవి సాంకేతిక పరిఙ్ఙానం జోడించి మంచి ఫలితాలు సాధించారు.. అప్పటి నుంచి జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో రవి సారథ్యంలో ప్రత్యేకమైన ఐటీ సెల్ ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
వినూత్నఆవిష్కరణలు
కాలక్రమంలో సాంకేతికంగా జరుగుతున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకొని, కొత్త సాఫ్ట్వేర్లను రూపొందించి ఐ.టి. విభాగాన్ని బలోపేతం చేశారు. జిల్లాలో ఈ ఆఫీస్ పేరుతో త్వరితగతిన ఫైళ్ళ క్లియరెన్స్, ఈ - కాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఫిర్యాదుల స్వీకరణ, రౌడీ షీటర్లుకు బయో హాజర్, జాతీయ రహదారుల మీద ఉన్న దాబాల వద్ద పార్కింగ్ వల్ల జరిగే ప్రమాదాలు నివారణకు ఎన్టీ పార్కింగ్ సిస్టం అప్లికేషన్ వంటివి అమలు చేస్తున్నారు. ఇవన్నీ రవి కృషి ఫలితమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నో అవార్డులు... మరెన్నో ప్రశంసలు
ప్రకాశం జిల్లా ఐ.టి. కోర్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ సాంకేతికను గతంలో ఇతర జిల్లాలూ వినియోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా సుమారు 4వేల మంది పోలీస్ సిబ్బందికి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మీద రవి శిక్షణా తరగతులు నిర్వహించారు. సుమారు 100 కీలకమైన కేసులను ఛేదించేందుకు రవి కృషి ఎంతో ఉంది. మారుతున్న పరిస్థితులు, సాంకేతిక పద్దతులను బట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాప్‌లను సృష్టిస్తూ, కేసుల ఛేదనకు మరింత కృషి చేస్తున్నారు.
ఇలా ఐ.టి. కోర్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి నిరంతరం కృషి చేస్తున్న రవికి అనేక అవార్డులు, ప్రశంసలు దక్కాయి. 200పైగా జిల్లా స్థాయిలో ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు, 2013లో రాష్ట్ర స్థాయిలో పోలీస్ సేవా పతకం లభించింది. తాజాగా భారత ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఇది అందుకున్నారు. ఈ అవార్డు తనకు భాద్యత మరింత పెంచిందని రవి అంటున్నారు. పోలీస్ శాఖలో సాంకేతికత ఎంత వినియోగించుకోగలిగితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. సాంకేతికంగా ప్రకాశం జిల్లా పోలీసు విభాగానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కల్లూరి రవి కృషి ఎంతో ఉందని, ఆయనకు అవార్డు రావడం ఎంతో ఆనందాన్నిస్తుందని పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.