TDP Bus Yatra: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి బస్సు యాత్ర చేరుకుంది. కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి కనిగిరి ప్రధాన వీధులలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇంఛార్జ్ ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి కనిగిరి పట్టణ సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం వద్దకు చేరుకొని గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను.. కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా నాయకులు నూకసాని బాలాజీ, కనిగిరి టీడీపీ బాధ్యుడు నరసింహారెడ్డి పార్టీ, ఇతర పార్టీ శ్రేణులు పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ గృహసముదాయం వద్ద సెల్ఫీలు దిగారు.
గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చాలనే ధ్యేయంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం 80% వరకు పూర్తయిందని.. వైసీపీ ప్రభుత్వం మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. 2024వ సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి టిడ్కో ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పేద ప్రజలకు అందిస్తామని తెలిపారు.
కనిగిరిలో టీటీడీ కల్యాణ మండప నిర్మాణం ఏర్పాటుకై.. గతంలో తితిదే ఛైర్మనా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని సందర్శించారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా శిలాఫలకం మాత్రం దృఢంగా నిర్మించారని కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో.. జగన్మోహన్ రెడ్డి కుటుంబ పరిపాలన సాగిస్తూ స్వామివారి సొమ్మును మింగేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అనకాపల్లి జిల్లాలో: భవిష్యత్తుకు గ్యారంటీ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిన బస్సు యాత్రకు అనకాపల్లి జిల్లా మాగవరపాలెం మండలం శెట్టిపాలెంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాచవరపాలెం వద్ద కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు
సత్యసాయి జిల్లాలో రెండో రోజు కొనసాగిన యాత్ర: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు కొనసాగింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర పట్టణంలోని జాతీయ రహదారి 42, ఇక్బాల్ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు మీదుగా కోనేరు వరకు కొనసాగింది. బడుగు బలహీన వర్గాలు మైనార్టీల ప్రాధాన్యమిచ్చే తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుందామని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కోరారు.
పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర 26వ తేదీ నుంచి: పల్నాడు జిల్లాలో భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన తొలి మేనిఫెస్టోపై ప్రచారం చేసేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఈ మేరకు బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను ల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వెల్లడించారు. ఈ యాత్రలో టీడీపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.