యంత్రాలతో మట్టి తవ్వకాలు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రకృతి సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. అదేంటో కానీ ప్రభుత్వ ఆస్తులను అక్రమార్కులు అప్పనంగా దోచుకుంటూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నా.. వారు కిమ్మనడం లేదు. ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి సంపదను అనుమతి లేకుండా తవ్వడం.. తరలించడం కానీ చట్టరీత్యా నేరం. ఆ తరహా నేరాలు మార్కాపురంలో ఇప్పుడు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంది. నిర్వాసిత గ్రామాలు ఖాళీ కాబోతున్నాయి. ఆయా ఊళ్లలో ఖాళీ చేసిన నిర్వాసితులు వారికి అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. మార్కాపురం ప్రాంతంలో వ్యవసాయ భూములు కొన్నిచోట్ల అనధికారిక వెంచర్లుగా మారిపోతున్నాయి. వెంచర్ల అభివృద్ధికి మట్టి ఎంతో అవసరం. దీంతో చెరువులు, కొండ ప్రాంతాల్లో ఉన్న మట్టిని తవ్వి తరలించడాన్ని ఇప్పుడు కొందరు పెద్ద ఆదాయ వనరుగా మలుచుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా.. యంత్రాల సాయంతో తవ్వి తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు.
ఆరు పొక్లెయిన్లు.. యాభై టిప్పర్లు...
మార్కాపురం మండలంలోని ఇడుపూరు ఇలాకాలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన కలనూతల-1కు సమీపంలో కొండ ఉంది. ఇక్కడ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఆరు పెద్ద పొక్లెయిన్లతో ఇక్కడ తవ్వకాలు సాగుతున్నాయి. 50 టిప్పర్లతో ఎర్రటి గలుగు వంటి మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కొక్క టిప్పరు రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. రోజుకు 300 ట్రిప్పుల వరకు మట్టిని తోలుతూ అక్రమార్కులు తమ జేబులు నింపుకొంటున్నారు. గత పది రోజులుగా రేయింబవళ్లు ఈ వ్యవహారం సాగుతోంది. కానీ అధికారులు మాత్రం ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం...
ఇడుపూరు ఇలాకాలోని కలనూతల నిర్వాసితుల కాలనీకి సమీపంలోని కొండ నుంచి అక్రమంగా మట్టి సరఫరా చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. మట్టి సరఫరాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి వెంటనే చర్యలు తీసుకుంటాం. మట్టి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. - ఎం.శేషిరెడ్డి, ఆర్డీవో, మార్కాపురం