రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. మాగాణి సాగుకు సంబంధించి నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు. సాగర్ నీటిని ఆయకట్టు భూములకు అందించి కర్షకులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిండా నీరుంది. రెండు జలాశయాలు నిండుకుండలా ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో రైతాంగం తీవ్ర భయాందోళన చెందుతోంది. గత పది రోజులుగా జలాశయాల్లో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నప్పటికీ... రైతులు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం బాధ్యతారాహిత్యం మూలంగా జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. వరి నార్లు పోసి ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి- ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే