Sri Madana Venugopala Swamy temple lands: ఇంతవరకు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఆక్రమించేస్తున్న అక్రమార్కులు... ఇప్పుడు ఏకంగా దేవుడి మాన్యాలను కూడా ప్రసాదంలా మింగేస్తున్నారు. ఆ దేవునికే శఠగోపం పెడుతూ, ఎటువంటి భయం లేకుండా అందినంత దోచుకుంటున్నారు. వారి కంటే మేమేమీ తక్కువ కాదంటూ ఆలయ అర్చకులు సైతం ఏడు తరాలుగా మేమే స్వామికి పూజా కైంకర్యాలు చేస్తున్నాము, కాబట్టి ఈ ఆలయం మాదే ఆలయానికి సంబంధించిన ఆస్తులు మావే అంటున్నారు. అర్చకులు సైతం భూములను ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆస్తులను అప్పనంగా మింగేస్తున్న ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
విదేశాల్లో రూ.30 కోట్ల బిజినెస్.. వ్యాపారాన్ని వదిలి గో సంరక్షణ కోసం దేశానికి..
పామూరు మండల కేంద్రంలో Pamuru mandal ఒకే ప్రాంతంలో నాలుగు ప్రముఖ ప్రసిద్ధ ఆలయాలున్నాయి. ఇక్కడే ప్రసిద్ధిగాంచిన శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయానికి సుమారు 390ఎకరాల వ్యవసాయ భూమి, పట్టన ప్రధాన కూడళ్లలో వాణిజ్య ఆస్థులు, ఆభరణాలు, విరాళాలు, హుండీ ఆదాయం ఉంది. అయితే, ఆలయం మాత్రం అవినీతి కోరల్లో విలవిల లాడుతోంది. కనీసం ఓచర్, బిల్లు పుస్తకాలు, నిర్వహించని దారుణ పరిస్థితి నెలకొంది. ఇందులో దేవాదాయశాఖ అధికారులు, అర్చకుల కీలకపాత్ర వహిస్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద్వాపరయుగం నాటిదిగా చెప్పుకునే ఈ ఆలయానికి.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అపారమైన ఆస్థులు ఉన్నాయి. ఇటీవల కాలంలో కోట్ల రూపాయల విలువైన భూములు, విలువైన స్థలాలు, ఆలయ నిధులు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు స్వాహా చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల్లో దేవాదాయశాఖ అధికారులు, పాలకమండలి, అర్చకులు కీలకపాత్ర పోషిస్తున్నారని భక్తులు పేర్కొంటున్నారు.
అక్రమార్కులకి రాజకీయ అండదండలు ఉండటంతో దొరికినంత దోచుకుంటున్నారు. దేవుడికి కనీసం దీపం వెలిగించే నాథుడు లేక దేవాలయం Hindu Temple గత వైభవాన్ని కోల్పోతుంది. ఇది సరిపోదన్నట్లు ఆలయానికి వచ్చే భక్తుల నుంచి సైతం ఆలయ అర్చకులు బలవంతంగా కానుకలు వసూలు చేస్తూ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అంతలా ఆస్తులు ఉన్నప్పటికీ ఏకంగా ఆలయానికి జీరో ఆదాయమని చూపుతూ దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారు. తాజాగా రహదారి విస్తరణ క్రింద మంజూరైన రూ.2 కోట్ల భూపరిహారం సొమ్మును సైతం స్వాహా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్తులు, భక్తులు కీలక ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలో భక్తులు ఏదైనా పూజలు,హోమాలు చేయించుకోవాలంటే కనీసం రూ.౩౦ వేల వరకు చెల్లించక తప్పట్లేదని ఆరోపిస్తున్నారు. ఇలా వసూలు చేసిన నగదుకు లెక్కలు ఉండవని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన భూములు, ఆస్తులను కాపాడి స్వామివారి ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని పట్టణ ప్రజలు, భక్తులు కోరుకొంటున్నారు.