తమ జీవితాలు బాగుపడతాయని ఎవరైతే వైకాపాకు ఓట్లేశారో వారిపైనే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు దమనకాండ కొనసాగిస్తున్నారని హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ కేసులపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయన్నారు. వైకాపా నేతల బెదిరింపు ధోరణితో దాడులపై బాధిత ఎస్సీ, ఎస్టీలు పోలీసు స్టేషన్కు వెళ్లేందుకు వెనకాడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా దాన్ని స్టేషన్లో పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకి కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయని శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వైకాపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేషన్ బెయిల్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్టం తీసుకు రావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి
అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే.. పరిస్థితేంటి ?: మంత్రి అవంతి