విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాబోదని, దానిని కాపాడే బాధ్యతను భాజపా రాష్ట్ర పార్టీ తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రసక్తే లేదని వివరించారు. దీని కోసం ఉద్యమిస్తున్నవారు డెయిరీలు, చక్కెర కర్మాగారాలు, స్పిన్నింగ్ మిల్లులు ప్రైవేటుపరం చేసినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై స్పందిస్తూ.. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పగలు పోరాటాలు చేస్తూ, లేఖలు రాస్తూ.. రాత్రుళ్లు దోస్తీ చేస్తూ కేసీఆర్‌ను ఢీకొట్టినట్లు కనిపించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంతసేపూ పోలవరం గురించి తప్ప సుదీర్ఘంగా కొనసాగుతున్న వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గురించి మాట్లాడే మంత్రులు ఒక్కరూ లేరని అన్నారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల వరద పారిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వరద పారిస్తోందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)పై ప్రభుత్వానికి స్పష్టత ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ‘నీటివనరులు- ఆంధ్రప్రదేశ్- భాజపా దృక్కోణం’ అంశంపై ఈ నెల 19న విజయవాడలో సదస్సు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఇంధనాల మూల ధర కంటే.. పన్నులదే పెద్ద మంట