ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నేలటూరివారిపాలెం గ్రామంలో 2వేల మందికిపైగా జనాభా ఉన్నారు. వీరిలో 200మందికి పైగా ప్రస్తుతం వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడో దశ కరోనా విజృంభిస్తున్న తరుణంలో.. పలు కంపెనీలు ఇంటి నుంచే విధులు నిర్వహణకు ఆదేశించాయి. గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే సొంతూరికి వచ్చేశారు. వీరంతా వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. ఒకేచోటకు చేరి విధులు నిర్వహిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
తాటాకులతో పందిరి వేశారు. ఇక్కడే షిఫ్ట్‌ల వారీగా వచ్చి విధులు నిర్వహించుకుంటున్నారు. ఒక్కొక్క షిఫ్ట్‌లో 20 మంది వరకు పనులు చేస్తున్నారు. చిన్నతనం నుంచి ఒకే పాఠశాలలో చదువుకుని కొలువులు వచ్చిన తర్వాత కూడా ఒకే చోట ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు.
వీరంతా.. గ్రామాభివృద్ధికి తమవంతు సాయం చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. రహదారి వెంట మొక్కలు నాటడం, గ్రామంలోని దేవాలయానికి మరమ్మతులు చేయించడం, మంచినీటి బావిని వినియోగంలోకి తేవడం, ఊరిలో విద్యుత్ స్తంబాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. పేద కుటుంబాలకు సాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇదీ చదవండి: