నవీకరించిన ఇసుక విధానంలో భాగంగా మూడు జోన్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్లు నిర్వహించగా.. కేవలం నాలుగు ప్రైవేటు సంస్థలు మాత్రమే బిడ్లు వేసినట్లు తెలిసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతకు సంబంధించిన సంస్థ, పక్క రాష్ట్ర నేతకు చెందిన సంస్థతోపాటు, మరో రెండు సంస్థలు ఉన్నట్లు సమాచారం.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు జోన్-1, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు జోన్-2, నెల్లూరు, రాయలసీమ నాలుగు జిల్లాలు కలిపి జోన్-3గా పేర్కొంటూ మొత్తం 471 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టారు. గత నెల 25న సాంకేతిక బిడ్లు తెరిచినట్లు తెలిసింది. ఈ బిడ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వచ్చే వీలుందని అధికారులు చెప్పినప్పటికీ, ప్రైవేటు సంస్థలే బరిలో నిలిచాయి. పురపాలిక ఎన్నికల నేపథ్యంలో ధరల బిడ్లు తెరవలేదని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు కూడా జాప్యమయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. ఊహించిన దానికంటే తక్కువ సంస్థలు బిడ్లు వేయడంతో.. టెండర్లు రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టెండర్ల వివరాల కోసం ఎంఎస్‌టీసీ అధికారులను సంప్రదించగా.. తాము ఎప్పటికప్పుడు గనులశాఖ సంచాలకుని కార్యాలయానికి సమాచారం తెలియజేస్తున్నామని, అక్కడే సమాచారం తీసుకోవాలని తెలిపారు. గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ఇదీ చదవండి:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రీ నోటిఫికేషన్‌పై విచారణ వాయిదా