ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కేదర్, రాములు అన్నదమ్ములు. కేదర్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. రాము బీటెక్ చదువుతున్నారు. ఏడాదిన్నర క్రితం కరోనా కారణంగా కేదర్ తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదోనన్న మీమాంసలో పడ్డారు. కానీ ఉద్యోగం కంటే.. ఏదైనా చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించారు.
అందులో భాగంగా సోదరుడితో కలిసి కాగితపు సంచుల తయారీ యూనిట్ ప్రారంభించారు. పర్యావరణానికి మేలు చేస్తూ..పలు వ్యాపార సంస్థలకే కాకుండా వివాహాది శుభకార్యాలకు, జన్మదిన వేడుకలకు ఇచ్చే కానుకల కవర్లపై ఫోటోలు, పేర్లు ప్రింట్ చేసి అందిస్తారు. దీనివల్ల సొంతూరులో ఉండి ఆదాయాన్ని గడిస్తున్నామని ఆ యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగితపు సంచుల తయారీతో స్థానికంగా కొంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వివిధ వ్యాపార సంస్థలు నుంచి తమకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయని చెబుతున్నారు. ఆలోచనలు ఉండాలే గానీ, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొని నిలబడగలమని ఈ అన్నదమ్ములు నిరూపించారు.