ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు సగిలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద కారణంగా పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని సత్యనారాయణ నగర్ సమీప ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కాలనీలోని చాలా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వరద ఒక్కసారిగా రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యేలోపే ఇళ్లల్లోని సామగ్రి మొత్తం నీటితో మునిగిపోయింది.
ఒక్కో కుటుంబానికి కనీసం రూ.50 వేల నష్టం..
ప్రతి ఇంటికీ కనీసం రూ. 50 వేల రూపాయల మేర నష్టం వాటిల్లింది. కొన్ని వందల కుటుంబాలు పూర్తిగా నష్టపోయి కట్టు బట్టలు కూడా లేకుండా వీధిన పడే దుస్థితి తలెత్తింది. ఆరేళ్ల కింద ఇదే రీతిలో వచ్చిన వరదతో చాలా మంది నిరాశ్రయులయ్యారు.
ప్రభుత్వాలు మారినా..
ప్రభుత్వాలు మారినప్పటికీ అక్కడ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రజలు వాపోతున్నారు. గత రాత్రి వరదతో నివాస సముదాయాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయినప్పటికీ అధికారులెవరూ స్పందించట్లేదని మండిపడుతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి కనీస అవసరాలు వెంటనే సమకూర్చాలని వేడుకుంటున్నారు.